తాడికొండలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా డైమండ్ బాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం 437 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే ఈ తరలింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన
కోరారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, తాడికొండలో 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులను ఆకస్మికంగా ఇతర ప్రాంతాలకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) గారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు, విద్యా ప్రగతి మరియు వారి కుటుంబాల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడికొండ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

