అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్రం సాధనకు అగ్ర సైన్యాధిపతిగా నిలిచారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సిపి
శ్రేణులతో కలిసి డాక్టర్ శైలజానాథ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ… సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్రం సాధనకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కులవ్యవస్థ వల్ల అణగారిన వర్గాలు ఎదుర్కొన్న అన్యాయాలను తొలగించేందుకు ఆయన జీవితాంతం పోరాడారు. ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. డా. బిఆర్.అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ, అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు నిరంతరం పోరాడారు. భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.

